Skip to content

జీవిత సంగ్రహం

తెలుగుదనం నిండిన గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉండే మహనీయమూర్తి, మానవీయ స్ఫూర్తి ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు. 72 సంవత్సరాల సంగీత సాహిత్య నాటక నృత్య సాంస్కృతిక జీవన ప్రస్థానంలో వీరు సాగించిన మజిలీలు ఎన్నో ఎన్నెన్నో! వాటిని అన్నింటినీ అక్షరబద్ధం చేసి ఈ విశ్వవల్లిక (వెబ్ సైట్) ద్వారా ఈ మహానుభావుణ్ణి సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం.

వేదపారాయణాలు ప్రతిధ్వనిస్తూ ప్రస్ఫుటమైన శృతి సందేశాల నిత్యసుమమాలికలు గుబాళించే ప్రకాశం జిల్లా ఆదిపూడి గ్రామంలో శ్రీగూడ రాఘవయ్య, సరస్వతమ్మ పుణ్య దంపతులకు మానవీయ విలువల నిరంతర క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృతభాండంలోని జ్ఞానతేజోవారాసిగా, తెలుగుతల్లి తేజోమూర్తిగా, సాహిత్యస్ఫూర్తిగా 1935 సెప్టెంబర్ 10న జన్మించిన బహుముఖ భారతి ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారు.

వైదిక పౌరోహిత్య కుటుంబంలో జన్మించినవారు శ్రీ జి.వి.సుబ్రహ్మణ్యంగారు వీరి తండ్రి శ్రీ రాఘవయ్యగారు. సంగీత పరిజ్ఞానంతో ఆ ఇంటికే వన్నె తెచ్చి ఆదిపూడికే మాది రూఢి అన్నట్లుగా ఆ ఇంటిని తీర్చిదిద్దిన రాఘవయ్యగారి ఇల్లాలు సరస్వతమ్మగారు. రాఘవయ్య, సరస్వతమ్మగార్లు దానధర్మాలతో ఆ వంశ యశస్సును ఇతోధికంగా పెంచినవారు.

శ్రీగూఢ రాఘవయ్య, సరస్వతమ్మగార్ల కుటుంబ జీవనం వైదిక పౌరోహిత్య ఆచరణకు నందన వనశ్రీచందనం. పేరుకు వైదిక కుటుంబం అయినప్పటికీ ఎన్నో దానధర్మాలు చేసి ఎందరెందరో జీవితాల్లోనో వెలుగు నింపారు. ఆప్యాయతా, అనురాగాలూ, జ్ఞానం పిల్లలకు పంచడమే కాకుండా దానగుణాన్ని, వంద దోషాల్లో కనిపించీ కనిపించకుండా ఉన్న గుణాన్ని చూసే విశాల దృక్పథాన్ని జి.వి. సుబ్రహ్మణ్యంగారి వారి తల్లిదండ్రులు శ్రీ గూఢ రాఘవయ్య, సరస్వతమ్మగార్లు అందించారు. ఒక అన్నయ్య ఇద్దరు అక్కయ్యలు తరువాత నాల్గొవ సంతానంగా జన్మించిన జి.వి. సుబ్రహ్మణ్యంగారికి అన్నయ్య, అక్కయ్యలు మంచితనాన్ని, వ్యక్తిత్వ విలువల్ని అందించారు. ఒకసారి ఊళ్ళో తుఫాన్ ప్రభావం వల్ల ఎందరో నిరాశ్రయులయ్యారు. కరణం కాకపోయినా కరణం బాబాయ్య అన్న వారందరికీ పౌరోహిత్యం ద్వారా సంపాదించిన పంచల్ని, చీరల్ని పంచిపెట్టి ఆ రాత్రి అందరికీ అన్నం పెట్టి పంపించిన ఉన్నత ఘనత జి.వి. సుబ్రహ్మణ్యంగారి తల్లిదండ్రులది. అన్నయ్య లక్ష్మీనారాయణరగారు తెలుగు పండితులు. అక్కయ్యలు వెంకట సుబ్బమ్మ, అన్నపూర్ణమ్మలు తెలుగు సాహిత్యంలో విదుషీమణులు కాకపోయినప్పటికీ జి.వి. సుబ్రహ్మణ్యంగారు సృష్టించిన అద్భుత కళాకృతులైన ఎన్నో పాటల్ని రసామృతవాహికలుగా తీర్చిదిద్ది పాడారు. కుటుంబంలో ఉన్న ఇటువంటి సహజ సేవా వైదిక పౌరోహిత్య వాతావరణం వల్లనే జి.వి. సుబ్రహ్మణ్యంగారు బహుముఖ భారతిగా తెలుగుతల్లి కంఠసీమలో నిత్యసుమమాలికగా నాటికీ నేటికీ మరెన్నటికీ పరిమళిస్తూనే ఉంటారు.

పర్చూరుల్ నేర్చుకున్న ప్రాథమిక విద్యాభ్యాసంలోని అక్షరాల జ్ఞానంతో, తల్లిదండ్రుల లాలనలో, ఆలనలో, పాలనలో వ్యక్తిత్వం స్థిరరూపాన్ని దాల్చిన మనిషిగా నిలిచిన జి.వి. సుబ్రహ్మణ్యంగారు తమ మేనమామ, అత్తగార్లైన శనగల శ్రీరామదాసు, వరలక్ష్మిలకు జన్మించిన సంగీత రసధుని సుశీలమ్మగారిని 1950 మే 8న వివాహం చేసుకున్నారు. శనగల వారి వంశం గూడావారి వంశంతో వివాహబంధంతో ఒకటైతే రెండు వంవాలకూ శుభం అని భావించిన వారు జి.వి. సుబ్రహ్మణ్యంగారి తల్లిదండ్ల రాఘవయ్య, సరస్వతమ్మలు.

వివాహం అయినప్పటికీ లక్ష్యసాధనకోసం భార్య సుశీలమ్మకు చాలారోజులు దూరంగా ఉన్నారంటే వారి కృతనిశ్చలత, దృఢదీక్ష ఎలాంటివో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.

అమ్మ అందించిన చిరుపాటి ఆర్థిక సహాయంతో నిజాం కాలేజీలో డిగ్రీ చేరారు. చెప్పులు లేకుండా తిరిగినప్పుడు ప్రిన్సిపాల్ గారు పిలిచి ఆప్యాయంగా మాట్లాడి అటెండర్ కి డబ్బులు ఇచ్చి చెప్పులు కొనివ్వమని చెప్పారు అని జి.వి. సుబ్రహ్మణ్యంగారు వైస్ ఛాన్సలర్ అయ్యాక కూడా మరిచిపోలేదంటే అతిశయోక్తి కాదు. డిగ్రీ చదివే రోజుల్లోనే అన్నగారు శ్రీ బిరుదు వెంకటశేషయ్యగారి దగ్గర అలంకారశాస్త్ర విషయాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అంతేకాక అన్నగారు సంపాదకులుగా ఉన్న మేధావి పత్రికకు సహాయ సంపాదకులుగా ఉండి వ్యాసాల్ని సరిచేసే వారు శ్రీ సాధు శ్రీనివాసశాస్త్రిగారి దగ్గర ఆధ్యాత్మిక విషయాల్ని, తెలుసుకోవడమేకాకుండా దత్తమంత్రోపదేశాన్ని పొందారు. డిగ్రీ చదివే కాలంలోనే అనేక విషయాలు భూమికలుగా ఉండటం చేతనే భవిష్యత్ కాలంలో జి.వి. సుబ్రహ్మణ్యంగారు బహుముఖ భారతిగా లబ్ధప్రతిష్ఠులయ్యారు. డిగ్రీ చదివిన తరువాత నాన్నగారితో కుప్పుస్వామి చౌదరి గారిని ఉద్యోగం కోసం కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం ఇంక చదవాలని లేదా? అని అన్నపుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని నసిగినప్పటికీ పెద్దాయన ఆప్యాయంగా మాట్లాడి అమ్మ నగల్ని అమ్మితే వచ్చిన డబ్బుతో చదవమని మొత్తం ఆ తతంగానికి కార్యనిర్వాహకుడిగా అయ్యాడు. ఎం.ఫిల్. రాత్రింబగళ్ళు కష్టించి విశ్వవిద్యాలయ సర్వ ప్రథమ స్థానంలో నిలిచారు.

జి.వి. సుబ్రహ్మణ్యంగారు ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు సర్వప్రథములుగా నిలిచిన వారికి ఉద్యోగ కల్పన అని చేపట్టిన ప్రణాళిక ద్వారా వరంగల్ లో తెలుగు ఉపన్యాసకుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. వరంగల్ లో ఇరివెంటి కృష్ణమూర్తి, సోమేశ్వరరావు, ఉపాధ్యాయ, సత్యనారాయణమూర్తి పురాణిక్ వంటి ప్రముఖులతో మిత్రమండలిలో చురుకుగా పాల్గొన్నారు. తన లక్ష్యమైన సృజన సాహిత్యానికి దూరమవుతున్నా, ఆ సృజనను సరైన గాడిలో పెట్టే విమర్శ రంగంలో తనదైన గుర్తింపును పొందారు జి.వి. సుబ్రహ్మణ్యంగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో రీడర్ గా పదోన్నతి రావటంతో మకాం హైదరాబాద్ కి మార్చారు.

‘‘చుట్టారా ఆవరించుకుని వున్న
చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం
కంటే, ప్రయత్నించి ఎంత చిన్న
దీపాన్నయినా వెలిగించడం మంచిది’’

అన్న యువ భారతిలో అలుపెరగని నిత్యసైనికుడిలా కార్యభారాన్ని మోదంతో మోసారు.

ఉద్యోగ నిర్వహణలో, స్వచ్ఛంద సాహిత్య సంస్థల నిర్వహణలో తలమునకలై ఇంటి గురించి పిల్లల గురించి పట్టించుకోవట్లేదని భార్య సుశీలమ్మగారితో ఎప్పుడూ అంటుండేవారు.

1979 నుండి 1995 వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో రీడర్ గా, ఆచార్యునిగా, 1995 నుంచి1998 వరకు అతిథి ఆచార్యునిగా, 1998 నుండి 2000 వరకు యు.జి.సి. ఎమెరిటస్ స్కాలర్ గా కార్యనిర్వహణా దురంధరుడిగా ప్రఖ్యాతి గాంచినవారు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు.

హైదరాబాదు విశ్వవిద్యాలయ తెలుగుశాఖను విమర్శరంగంలో వెలుగురేఖగా తీర్చిదిద్దడంలో కృతకృత్యులయ్యారు. బాధాతప్తహృదయులుగా ఉన్న ఎందరెందరికో ఆనందజీవన గగనంలో విహరించే నైతిక స్థైర్యాన్ని అందించినవారు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు.

సంప్రదాయం కాలానుగుణంగా మారాలంటూ తన కోడలు నిర్మల విషయాన్ని తెలిపిన భార్య సుశీలమ్మతో చెప్పిన మాటలు జీవితంలో వీరి పరిపక్వతకు సంకేతం.
అంతరంగంలోని అనంతరాగాల్ని, అక్షరరంగంగా మార్చి కన్నీటి సీమలకు పన్నీటి పీఠికలని అందించిన వారు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు.

20 పిహెచ్.డి. పట్టాలు, 43 ఎం.ఫిల్. పట్టాలు పొందటానికి పరిశోధక విద్యార్థులు సాగించిన నిరంతర సేద్యానికి క్షేత్రపాలకుడై నిలిచి పరిశోధకల జీవితాల్లో ఉద్యోగ సంక్రాంతికి కారకుడు, ప్రేరకుడు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు.

‘‘సంపాదించిన జ్ఞానమస్తకాలు పుస్తకాలు’’ అనదగినంత ప్రతిభా సంపన్నుడు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు గ్రంథవారాశిని, గంధసుమరాశిగా మరల్చి తెలుగు ప్రజల కంఠసీమలలో 31 సంయుక్త వైదగ్ధ్య మణిహారాల్ని అలంకరింపజేసి అవ్యక్తంగా జ్ఞాన తేజోపుంజంతో అలరిస్తున్న మహనీయుడు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు.
బహుమతులకు, పురస్కరాలకు పెట్టిందే పేరుగా ఎన్నో సంస్థల నుండి ఎన్నో బఫహుమతులు పురస్కారాలు స్వీకరించారు. బహుమతులు పురస్కారాలు వచ్చినప్పుడు వీరిలో కనిపించే మానసిక స్థితి భగవద్గీతలో పేర్కొన్న స్థిత ప్రజ్ఞ లక్షణం అని వేరుగా, నేరుగా చెప్పాల్సిన అవసరం లేదు.

‘‘కళ్ళు చెమ్మగిల్లు కలసి రెండు’’ అన్నట్లుగా ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గారి జీవిత ప్రస్థానంలో సుమ మధురిమల్ని వెదజల్లుతూ తన భర్తను తెలుగు సాహిత్య విమర్శకు, పరిశోధనకి అంకితం చేసిన అపర యశస్విని, మనస్విని సుశీలమ్మగారు. ఆమె ప్రోత్సాహమే లేకుంటే ఈ కీర్తి సౌధాల చేరగలగడంలో వీరు కృతకృత్యులయ్యే వారా? అనిపిస్తుంది. అందుకే జి.వి. సుబ్రహ్మణ్యంగారికి తెలుగు జాతి ఎంతగా ఋణపడి ఉందో సుశీలమ్మగారికీ అంతకంటే ఎక్కువ ఋణపడి ఉంది.

వాక్య నిర్మాణ సౌందర్యంలో, అభివ్యక్తి సౌందర్యంలో తన విమర్శని, పరిఫశోధనని ఉంచి సాహిత్య జగతికి చిలకరింపజేసి పులకరింపచేసిన ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఆగస్టు 15, 2006లో ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచి స్వర్గలోక ప్రస్థానం సాగించినప్పటికీ, తెలుగు సాహిత్య వినీలాకాశంలో అనునిత్యం ప్రకాశించే ధృవతార. ఆ ధృవతార కాంతులతో ఈ విశ్వవల్లికలో వివిధ విషయాల్ని చూసేందుకు మీకు సాదర స్వాగతం.

– గంగిశెట్టి లక్ష్మీనారాయణ, పరిశోధక విద్యార్థి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం