Skip to content

పరిపాలన భారతి

  • తెలుగు శాఖాధ్యక్షులు – హైదరాబాద్ విశ్వవిద్యాలయం
  • హ్యుమానిటీస్ డీన్ - హైదరాబాద్ విశ్వవిద్యాలయం
  • వైస్ ఛాన్స్‌లర్ – పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
  • ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ – డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం
  • కమిటీ ఛైర్మన్ – సాహిత్య అకాడమి
  • సభ్యులు – జ్ఞానపీఠ్ కమిటీ
  • స్టేట్ కన్వీనర్ – సత్యసాయి స్టడీ సర్కిల్

హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారి సేవలు

రీడర్ గానే అధ్యక్ష బాధ్యతలు, తెలుగుకు పూర్తిస్థాయి విభాగ హోదాకు కృషి

ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గొప్ప దార్శనికులు. విద్యావిషయికంగా కూడా వారి దార్శనికత హైదరాబాదు విశ్వవిద్యాలయంలో అద్భుతాలను ఆవిష్కరించింది. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలోని విద్యా కార్యక్రమాలను రూపొందించటంలో వారి పాత్ర గణనీయమైనది. వారు హైదరాబాదు విశ్వవిద్యాలయంలో రీడర్ గా చేరిన కాలంలో తెలుగుకు విభాగం అనే హోదా లేదు. తెలుగు, ఉరుదు అధ్యయనాలు స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లోని ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో భాగంగా కొనసాగుతూ ఉండేవి. కేంద్రానికి అధ్యక్షులు ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావుగారు తెలుగులో ఎం.ఎ., ఎం.ఫిల్., పిహెచ్.డి. కార్యక్రమాలకు రూపుదిద్దారు. వాటిని అప్పటిలో చాలావరకు సాంప్రదాయిక తెలుగు ఎం.ఎ., పరిశోధన కార్యక్రాలుగానే రూపొందించారు.

ఆచార్య కొత్తపల్లి వారి పదవీకాలంలో ఆచార్య జి.వి.యస్. తెలుగులో రెండవ స్థానంలోనూ, రీడర్ గానూ సేవలందించి, కొత్తపల్లివారు పదవీ విరమణ చేయటంలో సుబ్రహ్మణ్యంగారు రీడర్ గానే తెలుగు భాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. అప్పటివరకు తెలుగుశాఖలో మూడే పోస్టులు. ఒక ప్రొఫెసర్. ఒక రీడర్. ఒక లెక్చరర్. ఆచార్య కొత్తపల్లి వారు ప్రాఫెసర్. ఆచార్య జి.వి.యస్. రీడర్. ప్రముఖ రచయిత్రి ఆచార్య సి. ఆనందారామం గారు లెక్చరర్. తెలుగు భాగానికి అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్న వెంటనే జి.వి.యస్. గారు తెలుగు బోధన కార్యక్రమాన్ని పటిష్టపరచి తెలుగులో ఆధునికంగా అభివృద్ధి చెందిన అన్ని రంగాలలోనూ నిష్ణాతులైన అధ్యాపకులచేత బోధన జరిపించే విధంగా ప్రణాళికలు రచించి, తెలుగులో అదనంగా ఒక రీడరు, ఒక లెక్చరర్ పోస్టులు రావటానికి కృషి చసి సాధించారు.

పూర్తిస్థాయి తెలుగు విభాగానికి తొలి అధ్యక్షులు

హైదరాబాదు విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయనానికి ఆచార్య జి.వి.యస్. చేసిన మరొక కృషి తెలుగును పూర్తిస్థాయి విభాగంగా అవతరింపజేసే దిశలో సాగింది. ఆ కృషి ఫలించి 1985లో పూర్తిస్థాయి తెలుగు విభాగం అవతరించింది. ఆ సందర్భంలో డా. జి.వి. సుబ్రహ్మణ్యంగారు ప్రొఫెసరుగా నియమించబడి, విభాగం స్థాయికి పెంపు చేయబడిన తెలుగు విభాగానికి తొలి అధ్యక్షులుగా బాధ్యతలు మళ్ళీ చేపట్టారు. వారు ప్రొఫెసరుగా నియామకం పొందిన సమయంలలోనే అప్పటికే మంజూరు అయిన ఒక రీడర్, ఒక లెక్చరర్ పోస్టులలో కూడా నియామకాలు జరిగి ఆచార్య రవ్వా శ్రీహరిగారు రీడరుగాను, ఆచార్య పరిమి రామనరసింహం గారు లెక్చరర్ గానూ అప్పుడే ఏర్పడిన తెలుగు విభాగంలో బాధ్యతలు చేపట్టారు. అప్పటివరకు స్కూల్ ఆఫ్ సైన్సెస్ లోని ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో ఒక భాగంగా ఉన్న తెలుగును పూర్తి విభాగం హోదాతో స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ లోకి బదలాయించింది విశ్వవిద్యాలయం.

తెలుగు విభాగాభివృద్ధి పట్ల ఆచార్య సుబ్రహ్మణ్యంగారు ప్రదర్శించిన దార్శనికత కారణంగానే భవిష్యత్తులో ఆచార్య కె.కె. రంగనాథాచార్యులుగారు, ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యగారు, ఆచార్య ఎన్.ఎస్. రాజుగారు, ఆచార్య శరత్ జ్యోత్స్నారాణిగారు తెలుగు విభాగంలో చేరి విభాగం, కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించటానికి కారణం అయింది.

బోధన ప్రణాళికా రచన

ఆచార్య జి.వి.యస్. కొత్తపల్లి వారు ప్రవేశపెట్టిన సంప్రదాయ బోధన/పరిశోధన కార్యక్రమాలకు తెలుగు అధ్యయనంలో ఆధునిక ఆవిష్కరణలను కూడా బోధనలోనూ పరిశోధనలోనూ జోడించి కొత్త పుంతలు తొక్కించేందుకు శ్రీకారం చుట్టారు. అందుకు కావలసిన మేధామధనం కొరకు దేశంలోని తెలుగు భాషా సాహిత్యాలలో ప్రసిద్ధులైన ప్రస్తుత ఆచార్యులనూ, విశ్రాంత ఆచార్యులనూ తెలుగు విభాగానికి రావించి విశ్వవిద్యాలయాలలో తెలుగు బోధన, పరిశోధన, ‘ఇంతవరకూ, ఇక మీదట’ అనే ఒక జాతీయ సదస్సును అనిందపూర్వకంగా నిర్వహించారు. అంతవరకూ ఏ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలోనూ అటువంటి సదస్సు జరగలేదు. విజ్ఞాన కాంతులతో ప్రకాశించే ఆచార్యులందరినీ ఒకే వేదిక మీదికి తెచ్చిన ఆ సదస్సు విభాగంలోని స్నాతకోత్తర విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకు, అధ్యాపకులకు ఒక ఆదిత్య మండల దర్శనం; ఆచార్య సుబ్రహ్మణ్యంగారి విద్యావిషయిక దార్శనికతకు నిదర్శనం. తెలుగు అధ్యయన పరిశోధనలలో అన్ని రంగాలకూ చెందిన ఆచార్యులు ఆ సదస్సులో ఎన్నో విషయాలపై కూలంకషంగా చర్చించి వెలిబుచ్చిన సలహాలకు తమ వివేచనాబుద్ధితో మెరుగులు దిద్ది హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని తెలుగు విభాగంలోని తెలుగు బోధన పరిశోధనలలో గుణాత్మకమైన పరిణామాలను తీసుకువచ్చి దేశంలోని తెలుగు విభాగాలలో హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖను అగ్రస్థానాన నిలబెట్టారు. దాని ఫలితంగానే యూజీసీ వారి జె.ఆర్.ఎఫ్. పరీక్షలలో అధిక సంఖ్యలో హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం అప్పటితో మొదలైంది.

బోధనలో ప్రణాళికాబద్ధంగా ఆధునిక కోర్సులు

తెలుగు భాషా సాహిత్యాలలో పటిష్టమైన పునాదులు నిర్మించగల కోర్ కోర్సులతో బాటుగా ఆధునికంగా ఆవిష్కృతం అవుతున్న కొత్త కొత్త రంగాలలో తగిన పరిజ్ఞానం ఇచ్చే విధంగా ఐచ్ఛిక కోర్సులను ప్రవేశపెట్టటంలో ఆచార్య జి.వి.యస్. గారు దార్శనికతనూ, సృజనాత్మకతనూ ప్రతిబింబింపచేశారు. ఐచ్ఛిక కోర్సులను సాహిత్యం, భాష, ఔపయోగిక రంగాలు అని మూడు శ్రేణులుగా విభజించి ఒక్కొక్క శ్రేణిలో నాలుగు కోర్సులను ప్రవేశపెట్టి వాటిని నాలుగు సెమిస్టర్లలోనూ విద్యాథులు అధ్యయనం చేసేలా అవకాశం కల్పించారు.

ఇట్లా చెయ్యటంతో మొదటిదైన సాహిత్య శ్రేణిలోని నాలుగు కోర్సులను నాలుగు సెమిస్టర్లలో చదివి ఎం.ఎ. పట్టా పొందిన విద్యార్థికి ప్రాచీన, ఆధునిక, జానపద సాహిత్య రంగాలలోనూ, ఒక ప్రత్యేకు కవినో, ప్రక్రియనో లోతైన అధ్యయన చెయ్యటానికి కావలసిన అవకాశం ఏర్పడింది. ఇట్లాగే రెండవదైన భాషాశ్రేణివలో నాలుగు కోర్సులు, మూడవదైన జర్నలిజం, అనువాదం, మొదలైన ఔపయోగిక కోర్సుల శ్రేణిలో నాలుగు కోర్సులు ప్రవేశపెట్టి విద్యార్థులు తమ తమ ఆసక్తికి అనువైన శ్రేణిని ఎంచుకొని అధ్యయనం చేసే అవకాశం ఏర్పడింది.

దీని ఫలితంగానే హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు విభాగం వివిధ ప్రాంతాల నించి విద్యార్థులను అధికంగా ఆకర్షించటం మొదలైంది. అప్పటివరకు లేని ఒక కొత్త పరిణామంగా దీన్ని భావించవచ్చు. యూజిసి వారి పోటీ పరీక్షలకూ, దేశంలోని సివిల్స్ మొదలైన ఇతర పోటీ పరీక్షలకు కూర్చునే విద్యార్థులకు ఈ విభాగంలోని కోర్సుల వైవిధ్యం మంచి సహాయకారిగా పనిచేసింది. ఇంతకుముందే చెప్పినట్లుగా ఈ విభాగం నుంచి జె.ఆర్.ఎఫ్. పరీక్షలలో ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరగటానికి ఇక్కడి కోర్సులలోని వైవిధ్యం కారణం అయింది.

ఇంతటి పని భారానికి కావలసిన అదనపు అధ్యాపకుల పోస్టులను విభాగానికి సంపాదించి పెట్టటంలో కూడా ఆచార్య సుబ్రహ్మణ్యంగారి కృషి మరువరానిది.

పరిశోధనలో కొత్త పుంతలు

పరిశోధన రంగంలో సంప్రదాయ మార్గాలను, విధానాలను, అంశాలనూ పటిష్టం చేస్తూనే, కొత్త కోణాలను తాముగా ఆవిష్కరించటం, ఆ దిశలో అధ్యాపకులను, విద్యార్థులను ప్రోత్సహించటం అనేవి ఆచార్య జి.వి.యస్. గారు హైదరాబాదు విశ్వవిద్యాలయ తెలుగు విభాగానికి అందించిన గొప్ప ఒరవడి. ఆధునిక రంగాల పట్ల వారి సానుకూల దృష్టికి అది నిదర్శనం కూడా. ఆ కారణంగా తెలుగు విభాగంలో మొదటిసారిగా తెలుగు పరిశోధనకు నూతన రంగాలైన శైలీశాస్త్రం, ద్వితీయ భాషాబోధన, మొదలైన విషయాల మీద పరిశోధనకు విద్యార్థులు ముందుకు వచ్చారు. వీటితోపాటుగా సాహిత్య విమర్శలో కొత్త కోణాలు, ప్రాచీన సాహిత్యంలో కొత్త చర్చనీయాంశాలు. జానపద సాహిత్యంలోనూ, వ్యాకరణ, భాషాశాస్త్రాలలోనూ అంతవరకూ ఎవరూ స్పృశించని విభిన్న కోణాలూ పరిశోధనకు గ్రహించబడి తెలుగు విభాగ పరిశోధనా పార్శ్వానికి ఒక పరిపూర్ణత సమకూర్చాయి.

ఆలోకన ప్రాజెక్టు

ఆచార్య జి.వి.యస్. తెలుగు విభాగంలో ప్రవేశపెట్టిన ఆలోకన ప్రాజెక్టు వారి నవ్యాలోకన స్ఫూర్తికి చక్కని నిదర్శనం. ఈ ప్రాజెక్టు గురించి డాక్టర్ వెలగా వెంకటప్పయ్యగారి అభిప్రాయాన్ని వారి మాటలలోనే స్మరించుకోవటం సముచితంగా ఉంటుంది. ‘‘తెలుగు వాఙ్మయానికి సంబంధించిన సమాచారం అందించే గ్రంథాలు బహు తక్కువ. తగినంతగా, సాధికారంగా, తాజాగా ఉన్నప్పుడే శోధన, పరిశోధన, సజావుగా జరగటానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ జి.వి. సుబ్రహ్మణ్యం నేతృత్వంలో హైదరాబాదు విశ్వవిద్యాలయం ప్రచురించిన ‘‘ఆలోకన 1985’’ ప్రయోజనకరమైన ప్రయోగం. ఇందులో 1985లో తెలుగులో వెలువడిన పుస్తకాలు, పత్రికా రచనల సమాచారం ఉంది. బిబ్లియోగ్రఫీ, ఇండెక్స్ – రెండూ ఒక గ్రంథంలో కలిపి ఉభయతారకంగా ఉంది. ఇది వినూత్న ప్రయత్నం’’ అంటారు డా. వెంకటప్పయ్యగారు. (చందన, ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం షష్ఠిపూర్తి అభినందన సంచిక, పు. 78)

ఈ ప్రాజెక్టు ఉద్దేశం తెలుగులో వచ్చే అన్ని ప్రచురణలను ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వివరాలతో సహా పరిశోధకులకు, తెలుగు భాషా సాహిత్యాల పట్ల ఆసక్తి గల పాఠకులకు అందించటం.

ఉపన్యాస పరంపర

ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గారి వ్యక్తిత్వంలోని ఒక విలక్షణత అన్ని వైపుల నుంచి జ్ఞానాన్ని కొత్త ఆలోచనలను ఆహ్వానించటం. ఆ స్ఫూర్తితోనే హైదరాబాదు విశ్వవిద్యలయం తెలుగు విభాగం నడిచే విధంగా ఆయన కొన్ని కార్యక్రమాలను రూపొందించి అమలుపరిచారు. వాటిలో ముఖ్యమైనది వారు విభాగంలో ప్రవేశపెట్టిన ఉపన్యాస పరంపర. ఆయా రంగాలలో నిష్ణాతులైన వివిధ విద్వాంసులను విభాగానికి రావించి వారిచేత ఉపన్యాసాలు ఇప్పించటం వల్ల విద్యార్థులుక నూతన విషయాల పరిచయం, సహ అధ్యాపకులను కొత్త కోణాలలో ఆలోచింపచేయటం వంటి ప్రయోజనాలు పండించారు.

ఈ విధంగా, ఇంకా మరెన్నో సూక్ష్మాంశాల పట్ల విశేషమైన శ్రద్ధతోనూ తెలుగు విభాగాన్ని నడిపి విభాగాన్ని దేశంలో ఉన్న ఇతర తెలుగు విభాగాలకు స్ఫూర్తిదాయినిగా రూపొందించారు.

అధ్యాపకుడుగానూ, పరిశోధన పర్యవేక్షకుడుగానూ....

విశ్వవిద్యాలయాలలో విభాగాధ్యక్షులు విభాగ నిర్వహణ కార్య వ్యగ్రత వల్ల బోధన, పర్యవేక్షణకు తక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. కాని ఆచార్య సుబ్రహ్మణ్యంగారు ఇందుకు విరుద్ధం. వారు విభాగంలో బోధన పనిని ఏ మాత్రమూ తగ్గించుకోలేదు. పైగా, విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా అదనపు క్లాసులు కూడా తీసుకునేవారు. విద్యార్థులు వారి క్లాసులో పొందే ప్రయోజనాలను, అనుభూతులనూ ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అట్లాగే పరిశోధన పర్యవేక్షణలో కూడా జీవియస్ గారు ఏనాడూ పని తగ్గించుకోవాలని చూడలేదు. సాధారణంగా ఆచార్యులు, విభాగాధ్యక్షులుగా ఉన్నప్పుడు పిహెచ్.డి. విద్యార్థులకే ఎక్కువ సమయం. ప్రాధాన్యం కేటాయిస్తూ, ఎం.ఫిల్. విద్యార్థులను ఇతర అధ్యాపకులకు కేటాయించడం జరుగుతూ ఉంటుంది. కాని జివియస్ గారు ఇటువంటి వివక్ష చూపలేదు. ఫలితంగా ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారి దగ్గర అధిక సంఖ్యలో పరిశోధక విద్యార్థులు పిహెచ్.డి., ఎం.ఫిల్., పట్టాలు పొందటం ఒక విశేషంగా పరిగణించి, అప్పటి వైస్-ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ మెహతాగారు జీవియస్ గారి పట్ల ఒక విశేష గౌరవ భావాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు.

డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్

ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు హైదరాబాదు విశ్వవిద్యాలయ తెలుగు విభాగాన్ని విజ్ఞతతోనూ, వైదుష్యంతోనూ, మార్గదర్శక పటిమతోనూ నడిపి సాంప్రదాయిక ఆధునిక పద్ధతుల సమతౌల్యంతో బోధన పరిశోధనలలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పటమే కాకుండా, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్‌కు డీన్ గా కూడా పనిచేవారు. వారి నేతృత్వంలోనూ, దిగ్దర్శకత్వంలోనూ స్కూల్ లోని అన్ని విభాగాలూ మంచి విద్యా వాతావరణంలో ఇతోధికంగా అభివృద్ది సాధించాయి. అన్ని విభాగాలపట్లా సమదృష్టితోనూ, సౌజన్యంతోనూ సహకారం అందించారు. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్‌లోని అన్ని విభాగాలకూ చెందిన విద్యార్థులకూ ఉపాధ్యాయులకూ సౌకర్యాలను ఏర్పరచటంలో శక్తి వంచన లేకుండా కృషి చేసి అందరి ప్రశంసలూ అందుకున్నారు. రాబోయే కాలంలో స్కూల్‌కు ఏర్పడవలసి ఉన్న కొత్త భవనానికి కావలసిన ఆలోచనలు విశ్వవిద్యాలయ పరిపాలనా వ్యవస్థలో రూపుదిద్దుకోవటానికి తమ వంతు కృషి చేశారు.

- పరిమి రామనరసింహం

Development in process.....

Development in process.....

Development in process.....

Development in process.....