Skip to content

ప్రముఖుల అభిప్రాయాలు

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ: బహు గ్రంథ పరిశీలనము. బహు విషయ నిరూపణము సుబ్రహ్మణ్యంగారి పాండిత్యమునక నిదర్శనములు. వియ విభాగమే వారి శ్రద్ధకు సాధ్యం. దానిని నిరూపించుటకు చేసిన ప్రయత్నం ప్రశంసనీయం.

ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం: ప్రశంసనీయమైన స్వతంత్ర రచనమును, సాహసనిర్ణయములను చేయుశక్తి కలవారు, సంపూర్ణ కావ్యములందు వీర రసవివేచనము చేయుటలో దావించక ఈ సుబ్రహ్మణ్యంగు ఆంధ్ర లఘు కావ్యములందు, ముక్తములందు నవలలు, నాటకములు మున్నగు బహుళ సాహిత్య ప్రక్రియ లందు ధించు తమ రస నౌకను విహరింపజేశారు.

ఆచార్య ఎస్.వి. జోగారావు : వీర రసస్వభావాలు పరమ భావుకతతోనూ పలు శాస్త్రజ్ఞతతోను వివరించ, మన వివిధ వాఙమయశాఖలలో దానికి గల ప్రతిపత్తిని నిరూపించి అకాడమి బహుమతినందుకొన్నారు.

పుల్లెల శ్రీరామచంద్రుడు: రసమునకు సంబంధించిన నాలుగు వ్యాసాలూ ఆలోచనోత్తేజకంగానూ, పునఃపరిశీలనా యోగ్యంగానూ అతనికి ప్రతిహతములైన నూతన మార్గాలలో ఆలోచించగల సుబ్రహ్మణ్యంగారి ప్రతిభకు సంచూచికలుగా ఉన్నవి. నవ యవ్వనంలో ఉన్నప్పుడే మంచి నాటకాలు వ్రాసి ఆయా స్మర్థా స్థనాలలో ప్రయోగింపజేసి ఆయా కళాశాలలకు బహుమతులు సంపాదించిపెట్టారు.

తిరుమల శ్రీనివాసాచార్య: సుబ్రహ్మణ్యంగారు కావ్య కళామర్మజ్ఞులు. నాటక ప్రక్రియపై వారి పరిశోధన ప్రతిభ బహుముఖమైనది. అందులోని ఒక అంశం నాటక ప్రక్రియపై ప్రసరించి సహృదయులకు సంతృప్తిని కలిగించింది.

ఆచార్య పింగళి లక్ష్మీకాంతం సారస్వత సౌరభం గురించి: కళాపూర్ణోదయము నందలి సరస్వతీ చతుర్ముఖుల ప్రణయ కలహాంకాలకు వీరు చెప్పిన నూతన వ్యాఖ్యానము అపూర్వముగాను, అద్భుతముగాను ఉన్నది.

పాటిబండ మాధవశర్మ: కళాపూర్ణోదయమున సరికొత్తయైన మార్గమును తొక్కి అనితర సాధ్యములైన రహస్యములను సాధించి చిరంజీవి సుబ్రహ్మణ్యం ‘పింగళి’ నూతన ప్రతిష్టను మరోమెట్టు పైకెక్కించెను.

ఆచార్య దివాకర్ల వేంకటావధాని: సారస్వత సరభము నందలి ఒక్కొక్క వ్యాసం ఒక్కాక్క విశిష్టతో గూడి సుబ్రహ్మణ్యంగారి సర్వతోముఖ సామర్థ్యమును చాటుతున్నది.

పల్లా దుర్గయ్య: ఈ వ్యాసమును చదివిన మీదట కవి కంటే రసజ్ఞుడెరుగునను జ్ఞానము పాఠకులకు కలుగును. ఇది శ్రీ సుబ్రహ్మణ్యంగారి విమర్శ పాటవానికి గీటురాయి.

దివాకర్ల తిరుపతి వెంకట కవుల కావ్య సమీక్ష గురించి: తిరుపతి వేంకట కవిద్వయ సాహిత్య సమీక్ష మరొక పిహెచ్.డి. బిరుదమునకు పాత్రము కాదగినట్టిది.

ఆచార్య డా. సి. నారాయణరెడ్డి బసవపురాణం గురించి: డా. సుబ్రహ్మణ్యం వివేచన ఉన్న భావుకుడు. రసజ్ఞత ఉన్న నిశిత విమర్శకుడు. విద్య ఎనతూలు సమప్రమాణాలతో సంతరించుకున్న యువకుడు. పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న సాధకుడు. సాహిత్య యుగంలో ఇతడెక్కిన తొలిమెట్టు ‘వీరరసం, మలిమెట్టుతోనే దిద్భక్షువులకు మిరుమిట్లు గొల్పిన సాధకునికి, పరిశోధకునికి నా అభినందనం.

శరీరతత్వాన్ని తెలుసుకోవాలంటే నాడి పట్టి చూడాలి. గుండె చప్పుడు కొలిచి చూడాలి. సాహిత్య విమర్శకుడా అలాంటిదే తీసుకున్న విషయాన్ని విమర్శించటప్పుడు ముందు దాని అంతస్తును పట్టుకోవాలి. ఆ అంతఃసూత్రం ఆధారంగా అంగాంగ పరిశీలనం చేయాలి. ఇందు ఉత్తమ విమర్శ పద్ధతి సుబ్రహ్మణ్యంగారు ఈ పద్ధతికి చెందినవారు, ప్రాచీన ఆధునిక దృక్పథాలను, ప్రాచ్య, పాశ్చాత్య, సిద్ధాంతాలను లోతుగా పరిశీలించి తర్కసహంగా సమన్వయించడంలో ఆయన సమర్థుడు, ఆత్మతత్వాన్ని ఆవిష్కరించడం వల్లనే ఆయన విమర్శకు అంతటి ప్రామాణీకత.

శ్రీ రాయప్రోలు సుబ్బారావు: నవోదయలహరిలోని మా వ్యాసం (రాయప్రోలు సుబ్బారావు)ను నాచూపు అనుకూలించినంతవరకు చదివాను. బాగున్నది. మీరు కవి హృదయమును కవితాహృదయమును తాకగలరనిపించింది భావమును విశదీకరించేటందుకు చాలా యోగ్యముగా ఉన్నది మీ శైలి. ఇది గిఫ్ట్.

శ్రీ కొత్తపల్లి వీరభద్రరావుగారు రసోల్లాసం గురించి: ఈ వ్యాస సంపుటి రచయిత సర్వతోముఖ ప్రతిభకు, వైదుష్యానికి తార్కాణమా, సహజంగా గుణదోష విచారణతో తృప్తిపడతారు సామాన్య విమర్శకులు. ఈ విచారానికి మూలమైన తాత్త్వికత ఏమిటి అని ఆలోచిస్తారు సుబ్రహ్మణ్యంగారు.

అప్రమత్తత, భావతీక్షణత, పాండిత్యస్ఫూర్తి, ఔచిత్య పరిశీలన, బద్దనైశిత్యం సుబ్రహ్మణ్యం సహజపు వృత్తులు’ రచయిత ఆలోచనలో గాని రచనలోగాని, విషయ వివరాలలోని, విమర్శ విధానంలో గాని జంకుగంకులు కనిపించవు. సుబ్రహ్మణ్యం ఆత్మవిశ్వాసం ఉన్న పండిత విమర్శకుడు కనుకనే ఈ ధైర్యసాహసాలు ఒక్క పదబంధంలో చెప్పాలంటే సుబ్రహ్మణ్యం సహృదయ పండిత విమర్శకుడు. రసశబ్దం మంటే సుబ్రహ్మణ్యంగారు పరవశించిపోతారు. రసోవైనః మొదలుకొని సోవైరసః వరకు పయనిస్తేనేగాని ఆయనకు ఊర కలగదు అనుభూతితో రంగరించిన పాండిత్య విభూతిని నొసటదాల్చిన బ్రాహ్మణుడే సుబ్రహ్మణ్యుడు అంటే సహృదయులు ఔను అనకపోదు.

శ్రీ దేవులపల్లి రామానుజరావు: కవులు పండితులైన వారు కార్యదక్షులు కారనే అపకీర్తికి భిన్నంగా పాండిత్య, కవిత్వంతోబాటు కార్యదీక్షలో గూడా మంచి ప్రావీణ్యాన్ని సంపాదించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.

పోరంకి దక్షిణామూర్తి: ప్రాచీనాలంకారిక సిద్ధాంతాలను పునరన్వేషించి, నూతన సిద్ధాంతాలను, సమన్వయాలను ప్రతిపాదించే ప్రవృత్తిని కొందరు ప్రకటించారు. వారిలో ధర్మవీర ఏవ రసానం రసః అని ప్రతిపాదించినవారు డా. జి.వి. సుబ్రహ్మణ్యంగారు.

శ్రీ గుంటూరు శేషేంద్రశర్మ: సుబ్రహ్మణ్యగారు ఆంధ్ర సాహిత్య మల్లినాథసూరి లాంటివారు.

సి.నా.రె: కాలాన్ని జయించి నిలిచే రచనలు చేసిన లిటరరీ జీనియస్ జీవియస్.

ఉండేల మాలకొండారెడ్డి: సద్విమర్శయందు సదసద్వివేచన శక్తి ముందు నీకు సాటి లేదు.

ఆచార్య భీమసేన్ నిర్మల్ : అనేక భాషలలో జాతీయ భాష అయిన హిందీలో కావ్యశాస్త్ర విమర్శ పరిశీలనలో ఉత్తంగహిమ శృంగాంలాంటి వారైన ఆచార్య నగేంరదగారు సుబ్రహ్మణ్యంగారు ప్రతిపాదించిన సిద్దాంతాన్ని కొనియాడాలంటే అది వారికే కాదు సమస్త తెలుగు జాతికే గర్వకారణం.

నాగభైరవ కోటేశ్వరరావు: కవిత్వాన్ని కొలిచేరాళ్ళు తన దగ్గర లేవంటారు చలం. సాహిత్యాన్ని కొలిచే కొలమానమ్ జి.వి. సుబ్రహ్మణ్యంగారి దగ్గర ఉంది.

ఆచార్య చేకూరి రామారావు: సజీవసాహిత్య విజ్ఞాన సర్వస్వం జి.వి.యస్. మా తరంలో వేళ్ళ మీద లెక్కించదగిన పరిశోధకుల్లో సంయమనము, సమతౌల్యం ఉన్న స్కాలర్ జీవియస్.

ఎల్లూరి శివారెడ్డి: అభినవ ప్రస్థాన మర్మజ్ఞులు శ్రీ సుబ్రహ్మణ్యంగారు.

ఆచార్య ఎస్.వి. రామారావు: వర్తమాన సాహిత్య రంగంలో పరిశోధకుడిగా, విమర్శకుడిగా, ఆచార్యుడిగా, సమున్నత స్థానాని అధివసించిన సాహితీవేత్త శ్రీ జి.వి.సుబ్రహ్మణ్యంగారు.

ఆచార్య బేతవోలు రామబ్రహ్మం: శ్రీ జి.వి.యస్. ప్రతిజ్ఞావంతులైన విమర్శకులు ఆధునిక సాహిత్య రంగంలో వీరి అభిజాత్యాన్ని నిర్ధారించవలసి వస్తే రామస్వామి, విశ్వనాథ, శేషేంద్ర జీవయుగ కోవెల ద్వయం, తుమ్మడిపూడి ఇలా వీరిదొక పాఠశాల సమ వయస్కుల మధ్య వీరు మా దర్శనాచార్యులు.

డా. ముదిగొండ వీరభద్రయ్య: నిర్ణయ ప్రకటనలలో తాత్వికత, భయారాహిత్యమూ సత్యప్రీతి ఉండాలి. ఇవి సుబ్రహ్మణ్యంగారిలో దండిగా ఉన్నవి.

శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు: సాహిత్య రంగంలో వివిధ వాదాల పట్ల, సిద్ధాంతాల పట్ల ఉద్యమాల పట్ల ఆచార్య సుబ్రహ్మణ్యంగారికి సమదృష్టి ఉంది. అయితే సంప్రదాయం పట్ల ఆయన అంతరంగంలో కాస్తంత అభిమానం ఉన్నదనిపిస్తుంది.

డా. సి. ఆనందారామం: ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యంగారు అకాడమీ వక్తలు. నవలా రచయితగా, నాటకకర్తగా కవిగా అనేక సఫల ప్రయోగాలు చేసినా ఆంధ్ర సాహిత్య రంగంతో విమర్శన మణిగా విశిష్ట స్థానాన్ని నిలుపుకన్నారు. కవి పండిత విమర్శకలోకం చేత బహుళ ప్రశంసలు అందుకున్నారు. ఈనాటి సాహిత్య విమర్శ శక్తుల్లో ప్రధానంగా పేర్కొనదగినవారు. శాస్త్రీయ శాఖలో ఒకటైన విమర్శను సృజనాత్మక సమ్మేళనంలో కళగా రూపొందించిన ఘనత వీరిదే, తల పండితేకొత్త ఒరవడి, గళం విప్పితే ఆగని ఉరవడి. అందుకే సాహితీరంగంలోని యువ హృదయాలు వీరిపట్ల ఆరాధనతో పరవళ్ళు తొక్కుతాయి.

ఇరివెంకటి కృష్ణమూర్తి : డా. జి.వి. సుబ్రహ్మణ్యంగారు భారతీయ సాహిత్యశాస్త్ర తత్త్వానుశీలనం పట్ల అత్యంతమైన ఆసక్తిని పెంచుకొని కావలసినంత అభినివేశాన్ని సంపాదించుకోగలిగారు. తెలుగు, సంస్కృతము, ఇంగ్లీషు భాషలలో అనేక సాహిత్య గ్రంథాలను మథించి ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం అనే గ్రంథం రచించారు. ఈ పుస్తకంలోని భావాలు సాహిత్య విమర్శకే గాక భావసమైక్యానికి కూడా దోహదం చేస్తాయి. సంకుచిత దృక్పథం పరప్రత్యయబుద్ధి సాహితీసంస్థకెంత ప్రమాదకరమో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది.

డా.హెచ్.ఎస్. బ్రహ్మనంద: పాతను ఆధునిక మర్యాదలతో సమర్థిస్తూ, సమన్వయిస్తూ రచనలు సాగించిన వారో ఈ దశాబ్దంలో (1980)కి సుబ్రహ్మణ్యంగారు ఒకరు. ఉదా: అభినవలోచనం.

వెలుదండ నిత్యానందరావు: ఆచార్య సుబ్రహ్మణ్యంగారు రూపకాలంకారాలను అతిశయించి ఎక్కువగా వాడతారు. ఆధునిక విమర్శకుల్లో అగ్రాసనాధిపత్యం ఆచార్య సుబ్రహ్మణ్యంగారిది, నన్నయ్య నుండి నారాయణరెడ్డి, నగ్నమునిదాకా, ప్రాఙ్నన్నయ యుగాల నుండి దిగంబర, మినీ కవితల దాకా సుబ్రహ్మణ్యంగారు తాకని, వారికి తెలియని అంశం అంటూ లేదు.